Balakrishna: నాకు 'పద్మభూషణ్' ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు: బాలకృష్ణ

- పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్
- అందరికీ వినమ్రంగా ధన్యవాదాలు తెలిపిన బాలయ్య
- ముఖ్యంగా, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని వెల్లడి
సినీ రంగంలో విశేష రీతిలో విజయాలు అందుకుంటూ, అటు రాజకీయ రంగంలోనూ, మరోవైపు సామాజిక సేవా దృక్పథంలోనూ తనదైన రీతిలో ముందుకు వెళుతున్న నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిన్న బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, బాలకృష్ణ స్పందించారు.
తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తనకు పద్మ అవార్డు ప్రకటించగానే, ఎంతోమంది స్పందించి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న సహచర నటీనటులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, కుటుంబసభ్యులు, యావత్ సినీ రంగానికి మొత్తం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
ముఖ్యంగా, ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. నా వెన్నంటే ఉండి, అనుక్షణం ప్రోత్సహిస్తున్న అభిమానులకు, నాపై అమితమైన ఆదరాభిమానాలు ప్రదర్శిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని బాలకృష్ణ తెలిపారు. ఇక, ఇతర పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.