Ajinkya Rahane: పెవిలియన్ కు వెళ్లిన రహానెను వెనక్కి పిలిచిన అంపైర్.. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో వింత అనుభవం

- ముంబై- జమ్మూకశ్మీర్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్
- కీపర్ కు క్యాచ్ ఇచ్చి డగౌట్ కు వెళ్లిపోయిన రహానె
- నో బాల్ కావడంతో వెనక్కి పిలిపించిన అంపైర్
రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై- జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఓ వింత చోటుచేసుకుంది. కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్న ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానెను అంపైర్లు మళ్లీ బ్యాటింగ్ కు పిలిచారు. బంతి బ్యాట్ కు తగలడం, కీపర్ క్యాచ్ పట్టడం వరకూ ఓకే కానీ బౌలర్ ఆ బంతిని విసిరే క్రమంలో క్రీజ్ ను దాటాడని అంపైర్లు చెప్పారు.
దీనిపై సందేహం కలగడంతో కాసేపు వేచి ఉండాలని రహానెకు సూచించానని, ఆయనకు వినిపించకపోవడంతో పెవిలియన్ కు వెళ్లాడని ఫీల్డ్ అంపైర్ చెప్పారు. అది నోబాల్ అని కన్ఫర్మ్ కావడంతో రహానెను తిరిగి పిలిచామని తెలిపారు. అయితే, అనుకోకుండా వచ్చిన ఈ లైఫ్ ను రహానె సద్వినియోగం చేసుకోలేక కాసేపటికి మళ్లీ అదే బౌలర్ విసిరిన బంతిని గాల్లోకి లేపాడు. మిడాఫ్ లో జమ్మూకశ్మీర్ ఫీల్డర్ పరాస్ డోగ్రా అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంతో రహానె పెవిలియన్ కు చేరాడు.
ఈ విషయంలో రూల్స్ ఎలా ఉన్నాయంటే..
బ్యాట్స్ మన్ ఔటైనట్లు పొరపాటు పడి పెవిలియన్ కు వెళితే వెనక్కి పిలిచే అధికారం ఫీల్డ్ అంపైర్లకు ఉందని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయంలో సదరు బ్యాట్స్ మన్ పొరపాటు పడ్డాడనే విషయంపై అంపైర్లు సంతృప్తి చెందితేనే వెనక్కి పిలవొచ్చు. అదికూడా బౌలర్ మరో బంతి వేసే లోపే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ చివరి వికెట్ అయి మ్యాచ్ ముగిసిందనే ఉద్దేశంతో అంతా మైదానం వీడుతున్న సందర్భంలో ఇలా జరిగితే.. అంపైర్లు తాము మైదానం దాటేలోగా నిర్ణయం తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి.