Chandrababu: బిల్ గేట్స్ కు ఆల్ ది బెస్ట్: చంద్రబాబు

- దావోస్ లో బిల్ గేట్స్, చంద్రబాబు సమావేశం
- తన 'సోర్స్ కోడ్' పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించిన బిల్ గేట్స్
- బిల్ గేట్స్ కు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన పుస్తకం 'సోర్స్ కోడ్'ను చంద్రబాబుకు ఆయన బహూకరించారు. ఆ పుస్తకంపై 'మై ఫ్రెండ్ చంద్రబాబు... మనం కలిసి పని చేయడం చాలా గొప్పగా ఉంది' అని బిల్ గేట్స్ రాశారు.
దీని గురించి ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ... ''సోర్స్ కోడ్' పేరిట నా మిత్రుడు బిల్ గేట్స్ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ పుస్తకం కాపీని నాకు బహూకరించినందుకు ధన్యవాదాలు. బిల్ గేట్స్ తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే క్రమంలో ఆయన ప్రయాణంలోని అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. తన తొలి రోజులు, కాలేజీని వదిలి మైక్రోసాఫ్ట్ ను ప్రారంభించాలనే నిర్ణయం వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. బిల్ గేట్స్ కు ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేశారు.

