K Kavitha: మహిళా కలెక్టర్‌ను అవమానించారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కవిత డిమాండ్

- కరీంనగర్ కలెక్టర్‌ను మంత్రి అవమానించారన్న కవిత
- మొత్తం అధికార యంత్రంగాన్నే అవమానించినట్లని వ్యాఖ్య
- ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కవిత
మహిళా కలెక్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించారని, ఇందుకు మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తక్షణమే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కవిత... తీవ్రంగా స్పందించారు.
ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది కేవలం కలెక్టర్‌ను అవమానించడమే కాదని.. మొత్తం అధికార యంత్రాంగాన్నే అవమానించడమన్నారు. మహిళా కలెక్టర్‌కు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా కలెక్టర్‌కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.