Work From Home: అమెరికాలో ఉద్యోగులు ఇప్పుడు ఎక్కడ నుంచి పనిచేస్తున్నారు?.. వర్క్ ఫ్రమ్ హోమ్ శాతం ఎంత?

Where Americans Work From

  • పని విధానంలో గణనీయమైన మార్పును తీసుకొచ్చిన కరోనా
  • వర్క్ ఫ్రం హోం విధానానికి బాటలు వేసిన కొవిడ్-19
  • కొత్తగా తెరపైకి హైబ్రిడ్ మోడల్ పని విధానం
  • అమెరికాలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంటి నుంచే పని

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఉద్యోగుల పని విధానంలో గణనీయమైన మార్పులకు కారణమైంది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఇంటి నుంచి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ మార్పు ఉద్యోగులకు మరింత ఫ్లెక్సిబిలిటీని తీసుకొచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, పనిపై మరింత సామర్థ్యాన్ని ప్రదర్శించడం, ప్రయాణ బాధలు తప్పడం, పని-జీవితం మధ్య సమన్వయం వంటివాటికి వర్క్ ఫ్రం హోం బాటలు వేసింది. హైఫై సౌకర్యాలుండే కాస్మోపాలిటన్ నగరాలను వదిలి గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసుకునే సౌలభ్యం లభించింది. దీనివల్ల అనుకూలమైన పని వాతావరణం, సౌకర్యం లభించడంతోపాటు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 

అయితే, అదే సమయంలో సంప్రదాయంగా వస్తున్న కార్యాలయాల్లో పనిచేయడం వల్ల కూడా చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టే చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రం హోంను చాలించి ఇక ఆఫీసులకు రావాలని పిలుస్తున్నాయి. కార్యాలయాల్లో పని చేయడం వల్ల వ్యక్తిగత సహకారం, ఆకస్మికంగా తట్టే ఆలోచనలను సహోద్యోగులతో పంచుకోవడం వంటివి పనిని మరింత సులభతరం చేస్తాయి. ఉద్యోగుల మధ్య పరస్పర సుహృద్భావం నెలకొంటుంది. అంతేకాదు, ఆఫీసులోని నిర్మాణాత్మక వాతావరణం పని, వ్యక్తిగత జీవితాల మధ్య స్పష్టమైన సరిహద్దులను నిర్ణయిస్తుంది. పరధ్యానాన్ని తగ్గిస్తుంది. 

ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం, ఆఫీసులో పని.. ఈ రెండింటినీ మిళితం చేసే హైబ్రిడ్ మోడల్ తెరపైకి వచ్చింది. విభిన్న ఉద్యోగుల ప్రాధాన్యాలు, జీవన పరిస్థితులకు తగ్గట్టుగా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఇవి ఇల్లు, ఆఫీసుల్లో పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రతికూలతలను సమన్వయం చేస్తాయి.

‘స్టాటిస్టా కన్జ్యుమర్ ఇన్‌సైట్స్’ ప్రకారం ప్రతి ఐదుగురు అమెరికన్ ఉద్యోగుల్లో ఒకరు ప్రస్తుతం ఇంటి నుంచి క్రమం తప్పకుండా పనిచేస్తున్నారు. అయితే, 41 శాతం మంది మాత్రం క్రమం తప్పకుండా కార్యాలయాలకు వెళ్తున్నారు. ఫ్యాక్టరీ/మాన్యుఫ్యాక్చరింగ్ సైట్లలో 16 శాతం మంది, ఫీల్డ్ వర్క్‌లో 12 శాతం మంది, తాత్కాలిక వర్క్ సైట్లలో 10 శాతం, కోవర్కింగ్ స్పేస్‌లో 9 శాతం మంది, ఇతర చోట్ల 12 శాతం మంది పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News