Double Decker Rail: పైన ప్రయాణికులు.. కింద సరుకు.. డబుల్ డెక్కర్ రైళ్లకు కేంద్రం పచ్చజెండా

- డబుల్ డెక్కర్ రైళ్ల డిజైన్‌కు కేంద్రం ఆమోదం
- ఈ ఏడాదిలోనే పట్టాలపై పరుగులు తీయనున్న రైళ్లు
- కార్గో రవాణాలో మరింత వేగం పెంచేందుకే
- గణనీయంగా తగ్గనున్న నిర్వహణ వ్యయం
భారతీయ రైల్వే మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులు, సరుకును ఇకపై ఒకేసారి గమ్యం చేర్చేలా డబుల్ డెక్కర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ రైళ్ల డిజైన్‌కు సంబంధించి రైల్వేశాఖ గతేడాది సమర్పించిన డిజైన్‌కు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. రైల్వే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఈ డిజైన్‌ను రూపొందించింది.
ఈ డబుల్ డెక్కర్ రైలు కింది భాగాన్ని సరుకు రవాణాకు, పై అంతస్తును ప్రయాణికులకు ఉపయోగిస్తారు. దీనివల్ల సరుకు రవాణాలో వేగం పెరుగుతుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. కార్గో రవాణా ద్వారా మరింత ఆదాయం పొందేందుకు డబుల్ డెక్కర్ రైళ్లు దోహదం చేస్తాయని రైల్వే భావిస్తోంది.
ఒక్కో కోచ్ నిర్మాణానికి రూ. 4 కోట్లు
ఇందులో 18 నుంచి 22 కోచ్‌లు ఉంటాయి. కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు. ఒక్కో కోచ్ నిర్మాణానికి రూ. 4 కోట్లు అవుతుందని అంచనా. ఈ ఏడాది చివరి నాటికే ఈ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. 2023-24లో రైల్వే 1,591 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. 2030 నాటికి దీనిని 3 వేల మిలియన్ టన్నులకు పెంచాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనకు డబుల్ డెక్కర్ రైళ్లు దోహదపడతాయని రైల్వే భావిస్తోంది.