Vijayasai Reddy: ఇక ఢిల్లీలో వైసీపీ పనైపోయింది: విజయసాయి ప్రకటనపై రఘురామ స్పందన

- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి ప్రకటన
- ఈ నిర్ణయం బాధాకరమన్న రఘురామ
- తనకు తెలిసి విజయసాయి నెమ్మదస్తుడు అని వెల్లడి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం ప్రకటనపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. రఘురామ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, ఒక అరగంట క్రితమే ఈ వార్త చూశానని వెల్లడించారు. నిజాయతీగా చెప్పాలంటే, ఈ వార్త వినగానే మొదట బాధపడ్డానని తెలిపారు. ఎందుకు అనేది తాను చెప్పలేనని అన్నారు. గతంలో తాము అనేక సార్లు దెబ్బలాడుకున్న సందర్భాలు ఉన్నాయని రఘురామ తెలిపారు.
విజయసాయి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉందని, ఆయన స్వభావరీత్యా చాలా నెమ్మదస్తుడు అని వివరించారు. రాజకీయాలు అన్న తర్వాత ఏదో మాట్లాడతాం కానీ, నాకు తెలిసినంతవరకు విజయసాయి చెడ్డవాడు కాదు... మరి దుష్టుడి సహవాసంలో కొన్ని తప్పులు చేయవలసి వచ్చిందేమో అని వ్యాఖ్యానించారు.
"నేను కూడా ఆ పార్టీలో ఉండి బయటికొచ్చాను. కొంతమంది నాలాగా ఆర్నెల్లలోనే బయటపడగలరు... కొంతమంది అలా బయటపడలేరు. 2014-19 మధ్య పార్టీ కోసం విజయసాయి సొంతంగా ఖర్చు పెట్టారు. మద్రాస్ లో తన ఇంటిని, ఆఫీసును కూడా అమ్ముకున్నారు. అవి మనకు తెలిసినోళ్లే కొన్నారు. ఢిల్లీలో ఆయన కీ రోల్ పోషించారు. సాయిరెడ్డి ఢిల్లీలో తనదైన ముద్ర వేశారు. నా దృష్టిలో ఇక ఢిల్లీలో వైసీపీ లేనట్టే" అని రఘురామ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో, సదరు మీడియా చానల్ ప్రతినిధి స్పందిస్తూ... అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా ప్రకటన చేశారని చెప్పగానే.... ఆయన కూడానా అంటూ రఘురామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆయన కూడా లేరంటే... ఇక వైసీపీ పనైపోయినట్టే అని రఘురామ వ్యాఖ్యానించారు. "పార్లమెంటు సమావేశాలప్పుడు అప్పుడప్పుడు విజయసాయి, నేను ఎదురుపడితే కనీసం ఒక చిరునవ్వు ఉండేది. రాజకీయ పక్షాల పరంగా వేర్వేరు అయినప్పటికీ, మా మధ్య తీవ్రస్థాయి వైరం మాత్రం లేదు" అని రఘురామ వివరించారు.