Vijayasai Reddy: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి... సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్

- ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు విజయసాయి ఫారెన్ ట్రిప్
- నార్వే, ఫ్రాన్స్ వెళుతున్న వైనం
- జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయి
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని, అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి కూడా నిందితుడు అని తెలిసిందే. ఆయన బెయిల్ పై బయటున్నారు. దాంతో, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి.
ఈ నేపథ్యంలో... తాను నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ నేడు పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు తన విదేశీ పర్యటన ఉందని, అనుమతించాలని కోర్టును కోరారు. జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ స్పందన కోసం తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 27కి వాయిదా వేసింది.
కాగా, విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు.