Mamata Kulkarni: కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన నటి మమతా కులకర్ణి

- గతంలో అందాల తారగా వెలిగిన మమతా కులకర్ణి
- నేడు సన్యాసం స్వీకరించి మహా మండలేశ్వర్ గా మారిన వైనం
- పేరు కూడా మార్చుకున్న నటి
- గతంలో తెలుగులోనూ రెండు సినిమాలు చేసిన మమతా కులకర్ణి
ఒకప్పటి అందాల తార మమతా కులకర్ణి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఆమె కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాను మమతా కులకర్ణి నేడు సందర్శించింది. కిన్నారా అఖాడాలో ఆచార్య మహా మండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాసినిగా మారింది.
ఇకపై ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకుంటున్నానని, అందుకే మహా మండలేశ్వర్ గా మారుతున్నానని వెల్లడించింది. అంతేకాదు, తన పేరు ఇక నుంచి శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది.
ముంబయికి చెందిన మమతా కులకర్ణి గతంలో తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ వంటి చిత్రాల్లో నటించింది.. 2003లో ఓ బంగ్లాదేశీ సినిమాలో నటించాక, మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. 90వ దశకంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందింది. కరణ్ అర్జున్, సబ్ సే బడా ఖిలాడీ వంటి హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి.
2015లో ప్రియుడితో కలిసి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్లు. అంతకుముందు, ఓ మ్యాగజైన్ కోసం టాప్ లెస్ ఫొటోతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. ఇప్పుడు సన్యాసం స్వీకరించి, కాషాయం ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


