Amul: పాల ధరలను తగ్గించిన అమూల్

- అమూల్ తాజా, అమూల్ గోల్డ్, అమూల్ టీ స్పెషల్ పాలపై రూ.1 చొప్పున తగ్గింపు
- ఈ తగ్గింపు ధరలు దేశ వ్యాప్తంగా వెంటనే అమలులోకి వస్తాయని ప్రకటన
- అయితే, ఈ తగ్గింపు కేవలం లీటర్ ప్యాకెట్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టీకరణ
దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అమూల్ తాజాగా పాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అమూల్ తాజా, అమూల్ గోల్డ్, అమూల్ టీ స్పెషల్ పాలపై రూ.1 చొప్పున తగ్గించింది. ఈ మేరకు గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ తగ్గింపు ధరలు దేశ వ్యాప్తంగా వెంటనే అమలులోకి వస్తాయని ప్రకటించారు. అయితే, ఈ తగ్గింపు కేవలం లీటర్ ప్యాకెట్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఇక తాజా నిర్ణయంతో అమూల్ టీ స్పెషల్ పాల లీటర్ ప్యాకెట్ ధర రూ. 62 నుంచి రూ.61కి తగ్గింది. అలాగే అమూల్ తాజా పాల ధర లీటర్‌కు రూ. 54 నుంచి రూ. 53కి తగ్గగా... అమూల్ గోల్డ్ మిల్క్ ధర రూ. 66 నుంచి రూ. 65కి దిగి వచ్చింది. కాగా, అమూల్ గతేడాది జూన్‌లో పాల ధరలను లీటర్‌కి రూ. 2 చొప్పున పెంచింది. ఇప్పుడు కొంచెం తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చింది.