P Narayana: అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

- ఇప్పటి వరకు 40 పనులకు టెండర్లు పిలిచామన్న నారాయణ
- ప్రపంచ టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండాలనేదే లక్ష్యమని వ్యాఖ్య
- 250 మీటర్ల ఎత్తుతో అసెంబ్లీని నిర్మిస్తామన్న మంత్రి
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరాతి నిర్మాణం పునఃప్రారంభమయింది. రాజధాని నిర్మాణం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తాజాగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా పనుల ప్రారంభం ఆలస్యమయిందని తెలిపారు. మంత్రి నారాయణ ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు 40 పనులకు టెండర్లను పిలిచామని నారాయణ తెలిపారు. అమరావతిని ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల నిర్మాణానికి నార్మన్ ఫోస్టర్ చేత డిజైన్ చేయించామని వెల్లడించారు. 2019కి ముందే టీడీపీ హయాంలో జడ్జ్ లు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,053 ఫ్లాట్ లతో అపార్ట్ మెంట్ల పనులు ప్రారంభించామని తెలిపారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తామని... సమావేశాలు లేని రోజుల్లో దాన్ని టూరిజం స్పాట్ గా మార్చేలా డిజైన్లు రూపొందించామని చెప్పారు. తాగునీటి పైపులు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ లో ఉండేలా చేస్తున్నామని తెలిపారు.