Saif Ali Khan Attack Case: సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు: పలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నిందితుడి తండ్రి

Accused father raised questions in Saif Ali Khan Attack Case

  • ఇటీవల ముంబయిలో నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి
  • షరీఫుల్ ఇస్లాం అనే బంగ్లాదేశ్ జాతీయుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • తన కుమారుడ్ని అన్యాయంగా ఇరికించారన్న తండ్రి
  • వీడియోలో ఉన్నది తన కుమారుడు కాదని స్పష్టీకరణ

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం అమీన్ ఫకీర్ అనే వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, నిందితుడి తండ్రి మహ్మద్ అమీన్ ఫకీర్ ఈ ఘటన నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం చేశాడు. 

పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఉన్నది తన కుమారుడు కాదని స్పష్టం చేశాడు. తన కుమారుడు షరీఫుల్ కు జుట్టును   పొట్టిగా కత్తిరించుకోవడం అలవాటని, కానీ వీడియోలో ఉన్న వ్యక్తికి పొడుగు జుట్టు ఉందని తెలిపాడు. మరి తన కుమారుడికి ఉన్నట్టుండి పొడుగు జుట్టు ఎలా వచ్చిందని మహ్మద్ అమీన్ ఫకీర్ ప్రశ్నించాడు. 

పైగా, ఎంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే సైఫ్ అలీ ఖాన్ వంటి హీరోపై దాడి చేయడం సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా అని సందేహం వ్యక్తం చేశాడు. అసలు, సైఫ్ ఇంట్లోకి వెళ్లడం సులభమైన పనా? అని వ్యాఖ్యానించారు. ఈ కేసు విషయమై భారత్ లో తమకు సాయం చేసేందుకు ఎవరూ లేరని విచారం వ్యక్తం చేశాడు. అందుకే బంగ్లాదేశ్ లో న్యాయపోరాటం చేస్తామని చెప్పాడు. 

తన కుమారుడు గతేడాది మార్చిలో భారత్ కు అక్రమంగా వలసవచ్చిన మాట నిజమేనని, ముంబయిలో ఓ హోటల్ లో పనిచేస్తున్నాడని మహ్మద్ అమీన్ ఫకీర్ వెల్లడించాడు. ప్రతి నెల 10వ తేదీన జీతం తీసుకున్న వెంటనే తమకు ఫోన్ చేసేవాడని, సైఫ్ పై దాడి జరిగిన తర్వాత రోజు కూడా తన కొడుకుతో మాట్లాడినట్టు స్పష్టం చేశాడు. తన కుమారుడ్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు.

  • Loading...

More Telugu News