Saif Ali Khan: సైఫ్ కు శస్త్రచికిత్సపై సందేహాలు.. బెంగళూరు వైద్యుడి వివరణ

- 6 గంటల పాటు ఆపరేషన్ జరిగినా 6 రోజుల్లోనే నడుచుకుంటూ వెళ్లడం సాధ్యమేనా అంటూ సందేహం
- శారీరకంగా ఫిట్ గా ఉంటే సాధ్యమే అంటున్న బెంగళూరు వైద్యుడు
- 78 ఏళ్ల వయసున్న తన తల్లి వెన్నెముక ఆపరేషన్ అయిన రోజే నడిచిందంటూ వీడియో పోస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చేరడం, శస్త్రచికిత్స జరిగాక ఆరు రోజులకు డిశ్చార్జి అయి ఇంటికి చేరుకోవడం తెలిసిందే. ఆసుపత్రి నుంచి సైఫ్ నడుచుకుంటూ వెలుపలికి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో సైఫ్ ఫిట్ గా కనిపించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఆరు గంటల పాటు ఆపరేషన్ చేసిన మాట నిజమే అయితే సైఫ్ అంత ఆరోగ్యంగా, అసలేం జరగనట్టు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత అంత వేగంగా కోలుకోవడం ఎలా సాధ్యమని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి తాజాగా స్పందించారు.
సైఫ్ వేగంగా కోలుకోవడంపై కొంతమంది వైద్యులు కూడా సందేహాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇలా అనుమానించే వారికి అసలు వెన్నెముకకు జరిపే శస్త్రచికిత్స గురించి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. తన తల్లి 78 ఏళ్ల వయసులో వెన్నెముక ఆపరేషన్ జరిగిన రోజే నడిచిందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ పోస్టు చేశారు. ఆ వయసులోనూ తన తల్లి నడవగలిగినపుడు 54 ఏళ్లు ఉన్న సైఫ్ వారం రోజుల్లో నడుచుకుంటూ వెళ్లడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వైద్యులు వెన్నెముకకు జరిపే ఆపరేషన్ గురించిన మెడికల్ బుక్స్ రిఫర్ చేయాలని సూచించారు.