Anil Ambani: కృష్ణపట్నం భూములను పరిశీలించిన అనిల్ అంబానీ.. భారీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు!

- 2008లో రిలయన్స్ పవర్ కు 2,565 ఎకరాల భూమి కేటాయింపు
- సోలార్ ప్యానెల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం
- 2026 నాటికి పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యం
కృష్ణపట్నం పోర్టు సమీపంలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు రిలయన్స్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ చర్యలు ప్రారంభించింది. ఈ గ్రూపు సీఎండీ అనిల్ అంబానీ కృష్ణపట్నంలో పర్యటించడంతో ఇప్పుడు అందరి దృష్టి అటు మళ్లింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కు 2008లో అప్పటి ప్రభుత్వం 2,565 ఎకరాల భూమిని కేటాయించింది.
ఆ తర్వాత అనివార్య కారణాలలో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. 2019 వరకు అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో వైసీపీ ప్రభుత్వం భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆనాటి ముత్తుకూరు తహసీల్దారు అక్కడకు వెళ్లి నోటీసులు కూడా అతికించారు. అయితే సంస్థ ప్రతినిధులు కోర్టుకు వెళ్లడం, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో... సదరు సంస్థకే భూములను కేటాయించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. ఇప్పుడు అనిల్ అంబానీ భూముల పరిశీలనకు రావడంతో భారీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడబోతున్నాయనే క్లారిటీ వచ్చింది.
అక్కడ పరిశ్రమ ఏర్పాటయితే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అక్కడ సోలార్ ప్యానెల్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. 2026 నాటికి పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.