Saif: దాడి ఘటనపై పోలీసులకు సైఫ్ ఏం చెప్పారంటే..!

- వైద్యులు చెప్పిన విషయాలకు భిన్నంగా మెడికల్ రిపోర్టు
- సైఫ్ ను ఆసుపత్రిలో చేర్పించింది ఆయన కొడుకు కాదట
- తెల్లవారుజామున 4 గంటలకు అడ్మిట్ అయ్యాడని రిపోర్టులో వెల్లడి
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో పోలీసులు నటుడి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన సైఫ్ ను పోలీసులు కలుసుకున్నారు. దాడి జరిగిన రోజు ఏం జరిగిందనే వివరాలను అడిగి రికార్డు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుండగుడు తన కొడుకు జహంగీర్ గదిలోకి చొరబడినట్లు సైఫ్ తెలిపారు. దుండగుడిని తొలుత ఆయా గుర్తించిందన్నారు. ఆ సమయంలో తాను, తన భార్య కరీనా పదకొండో అంతస్తులోని తమ బెడ్ రూమ్ లో నిద్రిస్తున్నామని చెప్పారు. ఆయా అరుపులు విని తామిద్దరమూ కిందకు పరిగెత్తుకెళ్లామని వివరించారు. దుండగుడు రూ.1 కోటి డిమాండ్ చేశాడని, అతడితో తాను కలబడ్డానని సైఫ్ పేర్కొన్నారు. దుండగుడిని కదలకుండా పట్టుకుని బంధించే క్రమంలో తనపై కత్తితో దాడి చేశాడని చెప్పారు. కత్తిపోట్ల కారణంగా తాను పట్టు సడలించడంతో దుండగుడు పారిపోయాడని సైఫ్ చెప్పారు. ఆ సమయంలో తనతో పాటు కరీనా, ఆయా, తన కొడుకు జహంగీర్ ఉన్నారని తెలిపారు.
మెడికల్ రిపోర్టులో..
రక్తమోడుతున్న గాయాలతో సైఫ్ అలీఖాన్ అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల ప్రాంతంలో అడ్మిట్ అయ్యారని లీలావతి ఆసుపత్రి వైద్యులు చెప్పిన విషయం తెలిసిందే. నటుడిని ఆయన కొడుకు తైమూర్ ఆటోలో ఆసుపత్రికి తీసుకు వచ్చారని మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, మెడికల్ రిపోర్టు మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సైఫ్ అలీఖాన్ తెల్లవారు జామున 4 గంటలకు అడ్మిన్ అయ్యారని, ఆయన శరీరంపై ఐదు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని మెడికల్ రిపోర్టు వెల్లడించింది. సైఫ్ ను ఆయన స్నేహితుడు అఫ్సర్ జైదీ ఆసుపత్రికి తీసుకువచ్చారని రిపోర్టు పేర్కొంది.