Manish Sisodia: బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందన్న మనీశ్ సిసోడియా!

- తాను జైలులో ఉన్నప్పుడు బీజేపీ ఆఫర్ ఇచ్చిందన్న ఆప్ సీనియర్ నేత
- కేజ్రీవాల్‌ను వదిలేయకుంటే జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారని ఆరోపణ
- ఇతర పార్టీల నేతలను కొనడమే బీజేపీ విధానమని విమర్శ
తాను తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నెలలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాను జైలులో ఉన్నప్పుడు ‘కేజ్రీవాల్‌ను వదిలేస్తావా?.. లేదంటే జైలులో మగ్గిపోతావా?’ అని అల్టిమేటం జారీ చేశారని తెలిపారు.
జైలులో తాను ఇబ్బందులు పడుతున్న విషయం బీజేపీకి అర్థమైందని, దీనికి తోడు తన భార్య అనారోగ్యం బారినపడటం, కుమారుడు చదువుకుంటున్నాడని తెలిసి తనకు ఈ ఆఫర్ ఇచ్చారని తెలిపారు. బీజేపీలో చేరితే ఆప్ కూటమిని విచ్ఛిన్నం చేస్తామని, ఆ తర్వాత తనను సీఎంను చేస్తామని చెప్పారని వివరించారు. దీనికి అంగీకరించకుంటే సుదీర్ఘకాలంపాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారని పేర్కొన్నారు.
ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ విధానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజల అవసరాలతో వారికి పనిలేదని, అధికారం కోసమే బీజేపీ ఆరాటమని, మాట వినకుంటే జైలుకు పంపుతారని విమర్శించారు. కాగా, వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెల్లడవుతాయి. సిసోడియా జాంగ్‌పురా నుంచి పోటీ చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సిసోడియా 17 నెలల తర్వాత గత ఆగస్టులో బెయిలుపై విడుదలయ్యారు.