it searches: దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

- ఆర్ధిక లావాదేవీలపై ఐటీ అధికారుల తనిఖీ
- ఐటీ సోదాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్
- సంక్రాంతికి విడుదలైన మూవీలకు భారీ వసూళ్ల నేపథ్యంలో ఐటీ నజర్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. మంగళవారం నుండి మూడు రోజుల పాటు ఈ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి వరకూ దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో 21 మంది పాల్గొన్నారు.
సినీ ప్రముఖుల నివాసాల్లో ఐటీ సోదాలు జరగడం హాట్ టాపిక్ అయింది. దిల్ రాజు ఈ సంక్రాంతికి రామ్ చరణ్‌తో 'గేమ్ ఛేంజర్', వెంకటేశ్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రాలకు వసూళ్లు జోరుగానే వచ్చాయి. ఈ రెండు చిత్రాలే కాక బాలకృష్ణ 'డాకు మహారాజు' నైజాం హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో ఆదాయ పరంగా సరైన రీతిలో ట్యాక్స్ చెల్లించారా? లేదా? అనే విషయంపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఇళ్లలో, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. అలాగే అభిషేక్ అగర్వాల్, దిల్ రాజు కుమార్తె హన్సితా రెడ్డితో పాటు శిరీశ్, డైరెక్టర్ సుకుమార్ నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. మూడు రోజులుగా ఐటీ అధికారుల నిర్విరామ తనిఖీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.