Dasoju Sravan: రేవంత్ రెడ్డికి చంద్రబాబు దావోస్‌లో గడ్డి పెడితే బాగుండేది!: దాసోజు శ్రవణ్

- పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలన్న శ్రవణ్
- ఐటీ ఉద్యోగులు సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న దాసోజు శ్రవణ్
- ప్రతి వేదికపై రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు గడ్డి పెడితే బాగుండేదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. పెట్టుబడుల కోసమంటూ వెళ్లిన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
సీఎం హోదాలో విదేశాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్లినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. దేశ, రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయంగా ఇనుమడింపజేయాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి దావోస్‌లో మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చాయని మండిపడ్డారు. తెలంగాణలో పనిచేస్తోన్న ఐటీ ఉద్యోగులను రేవంత్ రెడ్డి కించపరిచారని ఆరోపించారు. ఐటీ ఉద్యోగులు సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు.
దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా పది శాతానికి పైగా ఉందని, కానీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేలా ఫ్యూడల్‌లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగులు చెమటోడుస్తూ దేశ ప్రగతికి తోడ్పడుతున్నారన్నారు. ఐటీ ఉద్యోగులపై దావోస్‌లో చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఐటీ సంస్థలు కూడా రేవంత్ రెడ్డి నుంచి క్షమాపణలు కోరాలన్నారు.
చైనా ప్లస్ వన్ కలిస్తే హైదరాబాద్ అని రేవంత్ రెడ్డి అంటున్నారని... అదేమిటో ఎవ్వరికీ అర్థం కాలేదన్నారు. రేవంత్ రెడ్డి వెంట ఎవరుంటున్నారో... ఏ సలహాలు ఇస్తున్నారో అర్ధం కావడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువును ప్రతి వేదికపై మంటగలుపుతున్నారని మండిపడ్డారు.