Dil Raju: ఐటీ సోదాలు జరుగుతుండగా దిల్ రాజు తల్లికి అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు

- దిల్ రాజు నివాసంలో మూడో రోజు ఐటీ సోదాలు
- సోదాల్లో పాల్గొన్న మహిళా ఉన్నతాధికారి సహా 21 మంది ఐటీ అధికారులు
- దిల్ రాజు తల్లిని ఆసుపత్రికి తరలించిన దిల్ రాజు కూతురు, ఐటీ అధికారిణి
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నివాసంలో మూడోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా దిల్ రాజు ఇంట్లో ఐటీ శాఖ మహిళా ఉన్నతాధికారి పాల్గొన్నారు. 21 మంది అధికారులు దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు.
దీంతో దిల్ రాజు కూతురు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారి వెంట ఐటీ అధికారిణి కూడా ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ఐటీ అధికారిణి తిరిగి దిల్ రాజు ఇంటికి వచ్చారు. ఈ సమయంలో ఫోన్ మాట్లాడమని తన చేతిలోని ఫోన్‌ను ఐటీ అధికారిణి... దిల్ రాజుకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఫోన్ తీసుకోకుండా దిల్ రాజు ఆమెపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.