Eknath Shinde: విమర్శలు మానకుంటే 20 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరే మిగులుతారు: ఏక్‌నాథ్ షిండే హెచ్చరిక

- శివసేన (యూబీటీ) తమను విమర్శిస్తోందని ఆగ్రహం
- వారు చేసే విమర్శల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని విమర్శ
- ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్పారని వ్యాఖ్య
ఉద్దవ్ ఠాక్రే శివసేన మొదటి నుంచి తనను, మహాయుతి కూటమిని విమర్శిస్తూనే ఉందని, ఇది మానుకోకుంటే ఇప్పుడున్న 20 మంది ఎమ్మెల్యేలు రెండుకు చేరుకుంటారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. వారు చేసే విమర్శల వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదన్నారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. వారి స్థాయి ఏమిటో ప్రజలే చెప్పారని, ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. ఓటమి పట్ల ప్రతిపక్ష కూటమి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. విమర్శలను ఇలాగే కొనసాగిస్తే మాత్రం శివసేన (యూబీటీ)కి 20 మంది ఎమ్మెల్యేల నుంచి ఇద్దరే మిగులుతారని హెచ్చరించారు.
ప్రతిపక్షాల నుంచి చాలామంది తమ పార్టీలో చేరారని, ఇది కొనసాగుతుందని షిండే అన్నారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ శివసేనకు ఆదరణ ఉందన్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ శివసేనను ప్రారంభిస్తామన్నారు.