Nara Lokesh: కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే రాష్ట్రానికి గుడ్ న్యూస్: నారా లోకేశ్

- దావోస్ పర్యటన నుంచి చంద్రబాబు తిరుగుప్రయాణం
- నేడు కూడా దావోస్ లోనే ఉండనున్న లోకేశ్
- ఇవాళ కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తో లోకేశ్ భేటీ
- ఏపీ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామన్న రవికుమార్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైనప్పటికీ, మంత్రి నారా లోకేశ్ దావోస్ లోనే ఉన్నారు. ఇవాళ ఆయన కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో ఎస్. రవికుమార్ తో దావోస్ బెల్వడేర్ లో భేటీ అయ్యారు. రవికుమార్ తో భేటీ అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నుంచి రాష్ట్రానికి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందని చెప్పారు.
"శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కో-వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ -2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను తయారుచేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరాం" అని లోకేశ్ వివరించారు.
కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ... కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లో పనిచేస్తున్న 80 వేల మంది ఉద్యోగులను టైర్ -1 నుంచి టైర్ -2 నగరాలకు మార్చేందకు ప్రణాళికలను ప్రకటించామని తెలిపారు. గ్లోబల్ స్కిల్ ఇనిషియేటివ్ లో భాగంగా జనరేటివ్ ఏఐ అధునాతన సాంకేతిక నైపుణ్యాల్లో 10 లక్షల మందికి సాధికారిత కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించామని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని రవికుమార్ తెలిపారు.