Ram Gopal Varma: చెక్ బౌన్స్ కేసుపై క్లారిటీ ఇచ్చిన‌ రామ్ గోపాల్ వ‌ర్మ‌

Ram Gopal Varma Give a Clarity on 3 Months Jail in Cheque Bounce Case

  • చెక్ బౌన్స్ కేసులో ఆర్‌జీవీకి 3 నెల‌ల జైలు శిక్ష విధించిన ముంబయి అంధేరీ కోర్టు
  • అలాగే వ‌ర్మ‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీ
  • ఈ కేసుకు సంబంధించి ఎక్స్ వేదిక‌గా స్పందించిన ద‌ర్శ‌కుడు
  • ఇది త‌న‌ మాజీ ఉద్యోగికి సంబంధించిన‌ రూ. 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు అని వివ‌ర‌ణ‌
  • దీనిపై త‌న‌ న్యాయవాదులు కోర్టుకు హ‌జ‌రవుతున్నార‌ని వెల్ల‌డి

చెక్ బౌన్స్‌ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మకు ముంబయి అంధేరీ మేజిస్ట్రేట్‌ కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. అలాగే ఆర్‌జీవీపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను కూడా జారీ చేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించి 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా వ‌ర్మ స్పందించారు. 

"నా మీద అంధేరి కోర్టు విధించిన శిక్షకు సంబంధించి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇది 7 ఏళ్ల‌ క్రితం నాటి విషయం. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన‌ రూ. 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హ‌జ‌రవుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున దీని గురించి ఇంత‌కు మించి నేను ఏమీ చెప్ప‌లేను" అంటూ ఆర్‌జీవీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

కాగా, చెక్ బౌన్స్ కేసులో ఆర్‌జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించిన న్యాయ‌స్థానం... మూడు నెల‌ల్లోగా ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాల‌ని ఆదేశించింది. అలా చేయ‌ని ప‌క్షంలో మ‌రో 3 నెల‌లు సాధార‌ణ జైలు శిక్ష విధిస్తామ‌ని కోర్టు పేర్కొంది.  

2018లో మహేష్ చంద్ర అనే వ్య‌క్తి వేసిన ఈ చెక్ బౌన్స్‌ కేసులో భాగంగా కోర్టు నేడు ఈ విధంగా తీర్పునిచ్చింది. గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని, వర్మ మాత్రం ఏనాడూ కోర్టులో హాజరు కాలేదని స‌మాచారం. దాంతో ఆగ్రహించిన ధ‌ర్మాస‌నం ఆయ‌న‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పుని ఇచ్చింది.

More Telugu News