Los Angeles wildfires: లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మొదలైన కార్చిచ్చు.. వేల ఎకరాల్లో ఎగసిపడుతున్న మంటలు.. వీడియో ఇదిగో!

- గంటల వ్యవధిలోనే 8 వేల ఎకరాలకు వ్యాపించిన మంటలు
- ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
- ఇటీవల బీభత్సం సృష్టించిన కార్చిచ్చు చల్లారకముందే మరోమారు దావానలం
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ను కార్చిచ్చు మరోమారు భయపెడుతోంది. ఇటీవల అక్కడ చెలరేగిన దావానలం చల్లారక ముందే మరోమారు మంటలు చెలరేగాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. గంటల వ్యవధిలోనే మంటలు 8 వేల ఎకరాలకు వ్యాపించాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవలి దావానలంలో కాలి బూడిదైన ఈటన్, పాలిసేడ్స్‌కు 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు ఈ కార్చిచ్చుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు.
కాగా, ఇటీవల లాస్ ఏంజెలెస్‌లోనే చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు పాలిసేడ్స్‌లో 68 శాతం, ఈటనలో 91 శాతం మంటలను అదుపు చేశారు.