Supreme Court: అస్సాం సర్కార్ పై సుప్రీం కోర్టు అగ్రహం .. సీఎస్‌కు నోటీసు

sc slams assam govt for keeping foreigners in detention centres summons chief secretary

  • విదేశీయుల నిర్బంధానికి కారణాలు ఎందుకు వెల్లడించలేదన్న సుప్రీం కోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లోపభూయిష్టంగా ఉందంటూ ఆక్షేపణ 
  • తదుపరి విచారణకు సీఎస్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హజరుకావాలని ఆదేశాలు 

అస్సాం ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మతియా తాత్కాలిక శిబిరంలో 270 మంది విదేశీయులను నిర్బంధించడానికి గల కారణాలు చెప్పకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణకు అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుకావాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. 

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లోపభూయిష్టంగా ఉందని, తాము కోరిన వివరాలు అందులో లేవని బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. డిసెంబర్ 9న విచారణ సమయంలో విదేశీయుల నిర్బంధానికి గల కారణాలు తెలుపడంతో పాటు వారిని దేశం నుంచి పంపించి వేయడానికి తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇందుకు ఆరు వారాల సమయం ఇచ్చింది. 

అయితే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో ఆ వివరాలు ఏమీ లేవని, విదేశీయులను ఇంకా నిర్బంధ శిబిరాల్లోనే కొనసాగించేందుకు సరైన వివరణ ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగాలేదని ధర్మాసనం ఆక్షేపించింది. 

  • Loading...

More Telugu News