Araku: అరకులో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభం.. గిరిజనులకు ఇక ఈజీగా పాస్‌పోర్ట్

- తపాలా శాఖ సహకారంతో ప్రారంభించిన కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ
- దేశంలో ఇది 43వ పీవోపీఎస్‌కే
- విశాఖపట్నంలోని ఆర్‌పీవోలో 8వది
- అరకు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులోకి సేవలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతం అరకులో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీవోపీఎస్‌కే) ప్రారంభమైంది. తపాలా శాఖ సహకారంతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నిన్న దీనిని ప్రారంభించింది. ఇది దేశంలోని 43వ పీవోపీఎస్‌కే కాగా, విశాఖపట్నంలోని రీజియన్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్‌పీవో) పరిధిలో ఎనిమిదవది.
పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనూజా రాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం జాయింట్ సెక్రటరీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ కేజే శ్రీనివాస, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దేశంలోని పౌరులందరికీ పాస్‌పోర్ట్ సేవలు అందించాలన్న విస్తృత లక్ష్యంతో అరకులో ఈ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. మరీ ముఖ్యంగా దేశంలోని మారుమూల, సుదూర ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
అరకు లోయలోని గిరిజన ఆధిపత్యం కలిగిన అన్ని గ్రామాల ప్రజలు ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఇప్పుడు చిక్కింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అరకు, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, పాడేరు ప్రాంతాలు ఉండగా, రంపచోడవరం అరకు లోక్‌సభ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇప్పుడీ ప్రాంతాల ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు చేరువయ్యాయి.