AP government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ పవర్‌ప్లాంట్‌కు కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్ రద్దు

government cancels registration of assigned lands in saraswati power plant land

  • సరస్వతీ పవర్ ప్లాంట్‌కు అసైన్డ్ భూములు
  • అధికారుల నివేదికతో రిజిస్ట్రేషన్ల రద్దుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
  • అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి చెందిన సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం కొనుగోలు చేసిన భూముల రిజస్ట్రేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ భూముల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములు ఉన్నట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ ప్లాంట్‌ కోసం కొనుగోలు చేసిన భూముల్లో మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాలను అసైన్డ్ భూములుగా ప్రభుత్వం గుర్తించింది. 

సరస్వతీ పవర్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నట్టు గుర్తించిన మాచవరం తహసీల్దార్ క్షమారాణి ఈ విషయమై కలెక్టర‌కు నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ అనుమతితో నిన్న మొత్తం 24.85 ఎకరాల అసైన్డ్ భూములను రద్దు చేసినట్టు క్షమారాణి వెల్లడించారు. 

పల్నాడు జిల్లాలోని చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలను సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయినప్పటికీ ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ భూముల్లో అటవీ, అసైన్డ్ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ భూములపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అధికారులు ఇటీవల సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై సర్వే చేశారు.

ఆరోపణలు వచ్చినట్టుగా వీటిలో అటవీ భూములు లేవని అధికారులు గుర్తించారు. అయితే, అదే సమయంలో 24.84 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్న విషయం బయటపడింది. ఈ క్రమంలో తహసీల్దార్ నివేదిక అనంతరం కలెక్టర్ ఆదేశాలతో పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.

  • Loading...

More Telugu News