Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై మరోసారి స్పందించిన రేవంత్ రెడ్డి

- తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా? అని మీడియా ప్రతినిధి ప్రశ్న
- అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చాక అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారన్న సీఎం
- తొక్కిసలాటలో మనిషి చనిపోవడం అల్లు అర్జున్ చేతుల్లో లేకపోవచ్చన్న సీఎం
- కానీ పది పన్నెండు రోజులు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదన్న సీఎం
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం... ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.
దీనికి సీఎం స్పందిస్తూ... రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారని, అయినా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, దీంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని పక్కకు తోసేశారన్నారు. ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయినట్లు చెప్పారు. ఒక మనిషి చనిపోవడం అనేది ఆయన (అల్లు అర్జున్) చేతుల్లో లేకపోవచ్చు కానీ... ఆ మహిళ కుటుంబాన్ని పది పన్నెండు రోజులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కదా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ... అల్లు అర్జున్‌ను ఎందుకు అరెస్ట్ చేశామో చంద్రబాబుకు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చన్నారు.