Ram Gopal Varma: నాకు, అమితాబ్ కు మధ్య ఓ సీన్ పై అభిప్రాయభేదం వచ్చింది: రామ్ గోపాల్ వర్మ

- 'సర్కార్' సినిమాలో ఒక సన్నివేశంపై ఏకాభిప్రాయం కుదరలేదన్న వర్మ
- చివరకు తాను సూచించిన విధంగానే అమితాబ్ చేశారని వెల్లడి
- కొన్నిసార్లు మౌనంగా ఉంటే పరిస్థితులు మారతాయని వ్యాఖ్య
మనకు నచ్చకపోయినా కొన్నిసార్లు మౌనంగా ఉంటే పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పారు. 'సర్కార్' సినిమాలో తన కుమారుడిని అమితాబ్ బయటకు వెళ్లమనే సందర్భం ఉంటుందని... ఆ సన్నివేశాన్ని ఎలా చేయాలనేదానిపై తనకు, అమితాబ్ కు మధ్య అభిప్రాయభేదం వచ్చిందని తెలిపారు.
కొడుకును బయటకు వెళ్లాలని కోపంగా అరిచి చెప్పాలని తాను సూచిస్తే... సర్కార్ అందరిలాంటోదు కాదని అందుకే మరోలా చేయాలని అమితాబ్ చెప్పారని... అంతగొప్ప నటుడితో వాదించడం ఇష్టంలేక తాను మౌనంగా ఉండిపోయానని చెప్పారు. అయితే, ఆరోజు రాత్రి 11 గంటలకు అమితాబ్ ఫోన్ చేసి... నేను అనుకున్న దానికంటే నువ్వు చెప్పిందే బాగుందని అన్నారు... నీవు చెప్పిన విధంగానే రేపు రీషూట్ చేద్దామని చెప్పారని అన్నారు. ఆ తర్వాత ఆ సీన్ ను రీషూట్ చేశామని తెలిపారు. నటుడికి, డైరెక్టర్ కి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.
2005లో వచ్చిన 'సర్కార్' సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో అమితాబ్ తో పాటు అభిషేక్ బచ్చన్ కూడా నటించారు. ఈ సినిమాకు 'సర్కార్ రాజ్' పేరుతో సీక్వెల్ నిర్మించారు. ఈ చిత్రంలో అమితాబ్, అభిషేక్ తో పాటు ఐశ్వర్యారాయ్ కూడా నటించారు.