Chandrababu: కర్ణాటక రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

- కర్ణాటకలోని సింధనూరు వద్ద రోడ్డు ప్రమాదం
- బోల్తా పడిన వాహనం... నలుగురి మృతి
- మృతుల్లో డ్రైవర్ సహా ముగ్గురు వేద విద్యార్థులు
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవడం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం దిగ్భ్రాంతిని, తీవ్ర ఆవేదనను కలిగించిందని వెల్లడించారు. హంపి సందర్శనకు వెళుతూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించానని తెలిపారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో వారి కుటుంబాలు తీవ్ర శోకంతో ఉన్నాయని, వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు వివరించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు.