Kakani: మాజీ మంత్రి కాకాణిపై కావలిలో కేసు

--
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కావలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో జరిగిన ఓ కార్యక్రమంలో కాకాణి మాట్లాడుతూ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై కోళ్లదిన్నెకు చెందిన ప్రసన్న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
బోగోలు మండలం కోళ్లదిన్నెలో ఇటీవల టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడున్న పోలీసులతో కాకాణి అనుచితంగా ప్రవర్తించారు. తొందర్లోనే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తానంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా వదలబోమని హెచ్చరించారు. మాజీ మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేత వంటేరు ప్రసన్న కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.