Pruthvi: ఓటీటీలో 'పోతుగడ్డ' .. ఊపిరి బిగబట్టే కంటెంట్!

- యాక్షన్ డ్రామాగా రూపొందిన 'పోతుగడ్డ'
- నేరుగా ఓటీటీకి వస్తున్న సినిమా
- ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- ఉత్కంఠను రేకెత్తిస్తున్న ట్రైలర్
ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో కూడిన సినిమాలు వస్తున్నాయి. అలా ఇప్పుడు మరో యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నేరుగా ఓటీటీకి వస్తున్న ఆ సినిమా పేరే 'పోతుగడ్డ'. శరత్ చంద్ర - అనుపమ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి, రక్ష వీరమ్ దర్శకత్వం వహించాడు.
పృథ్వీ .. విస్మయ శ్రీ .. శత్రు .. ఆడుకాలం నరేన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, దాదాపు కొత్త ఆర్టిస్టులే కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాకి 'మార్కస్' సంగీతాన్ని అందించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
కథ విషయానికి వస్తే .. కిట్టూ - గీతూ ప్రేమించుకుంటారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి, ఓ రాత్రివేళ ఆ ఊరు నుంచి బస్సులో బయల్దేరతారు. వాళ్లను ఒక గ్యాంగ్ వెంటాడుతూ ఉంటుంది. మరో గ్యాంగ్ ఆ బస్సులో 50 కోట్లను అక్రమంగా తరలిస్తూ ఉంటుంది. ఒక వైపు నుంచి రాజకీయనాయకుడు .. మరో వైపున పోలీసులు కూడా ఆ బస్సును టార్గెట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? అనేది కథ.