Urmila Matondkar: రామ్ గోపాల్ వర్మతో విభేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు ఊర్మిళా మతోండ్కర్ స్పందన

- అప్పట్లో హిట్ కాంబినేషన్ గా కొనసాగిన ఊర్మిళ, వర్మ కాంబినేషన్
- వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్
- ఇటీవల రీ రిలీజ్ అయిన 'సత్య' మూవీ
అందాల నటి ఊర్మిళా మతోండ్కర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ అప్పట్లో ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అంతం', 'గాయం', 'రంగీలా', 'సత్య' ఇలా అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్ లో సైతం వీరు హిట్ కాంబినేషన్ గా నిలిచారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేయలేదు. తాజాగా 'సత్య' రీ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఊర్మిళ స్పందించారు.
ఆర్జీవీకి, మీకు మద్య విభేదాలు వచ్చాయా? అనే ప్రశ్నకు సమాధానంగా... అలాంటిదేమీ లేదని ఊర్మిళ అన్నారు. తామిద్దరం మళ్లీ కలిసి పని చేయకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదని తెలిపారు. వర్మ తెరకెక్కించిన 'కంపెనీ', 'రామ్ గోపాల్ వర్మకీ ఆగ్' చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించానని చెప్పారు. వర్మ ఒక గొప్ప డైరెక్టర్ అని... ఆయన చిత్రాల్లో నటించినందుకు గర్వపడుతున్నానని అన్నారు. మరోసారి అవకాశం వస్తే వర్మ, మనోజ్ బాజ్ పాయ్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.
1998లో విడుదలైన 'సత్య' సినిమాలో ఊర్మిళ, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ నెల 17న ఈ చిత్రం రీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉత్తమ సహాయ నటుడిగా మనోజ్ బాజ్ పాయ్ జాతీయ అవార్డు అందుకున్నారు.