Talasani: తలసాని ఇంట్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్

- జూబ్లీహిల్స్ లోని తలసాని నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం
- జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం అంశంపై చర్చిస్తున్న నేతలు
- అవసరమైనంత మంది సభ్యులను సమకూర్చుకోవడంపై సమాలోచనలు
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ లంచ్ మీటింగ్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం అంశంతో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు ఉన్న కార్పొరేటర్ల బలం, అవిశ్వాసం పెట్టేందుకు ఎంత సంఖ్య అవసరం అనే కోణంలో చర్చిస్తున్నారు. అవసరమైనంత మంది సభ్యులను ఎలా సమకూర్చుకోవాలి అనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.
ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి, మాజీ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా సమావేశానికి హజరైనట్టు సమాచారం.