Women's U19 T20 WC: అండర్-19 ఉమెన్స్ వరల్డ్‌కప్... మలేషియాపై భారత్ బంపర్ విక్టరీ

- కౌలాలంపూర్ వేదికగా మలేషియా, భారత్ మ్యాచ్
- 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన యువ భారత్
- టీమిండియా బౌలర్ల ధాటికి 31 పరుగులకే కుప్పకూలిన మలేషియా
- 2.5 ఓవర్లలోనే 32 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా
- ఐదు వికెట్లతో రాణించిన వైష్ణవి శర్మ
ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా కౌలాలంపూర్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బంపర్ విక్టరీ సాధించింది. యువ భారత్ ఏకంగా 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మలేషియా నిర్దేశించిన 32 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా టీమిండియా 2.5 ఓవర్లలోనే ఛేదించింది.
ఓపెనర్లు గొంగడి త్రిష (21), కమిలిని (4) పరుగులు చేశారు. తెలుగమ్మాయి త్రిష 12 బంతుల్లో 5 బౌండరీలతో 21 రన్స్ చేయడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన మలేషియాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఆతిథ్య జట్టు 14.3 ఓవర్లలో 31 పరుగులకే చాపచుట్టేసింది.
మలేషియా బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేయలేదు. అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో హుస్నా(5), అలియా (5) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఏకంగా నలుగురు డకౌట్ అయ్యారు.
ఇక భారత బౌలర్లలో స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా 5 వికెట్లు పడగొట్టి మలేషియా పతినాన్ని శాసించింది. అలాగే ఆయుశి 3, జోశిత 1 వికెట్ పడగొట్టారు. 5 వికెట్లతో రాణించిన వైష్ణవి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
కాగా, ఈ టోర్నీలో ఇది యువ భారత్‌కు రెండో విజయం. టీమిండియా తన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే.