Etela Rajender: రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను కొట్టిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్... ఇదిగో వీడియో

Etela Rajendar slaps Real Estate agent

  • మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఘటన
  • రియల్ ఎస్టేట్ ఏజెంట్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు
  • ఇంటి స్థలాల యజమానులను ఇబ్బందిపెట్టడమేమిటని ఆగ్రహం

పేదల భూములను ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ... బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను కొట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ వైపు కోపంగా దూసుకొచ్చిన ఈటల అతని చెంపపై ఒక్కటి కొట్టారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా కొంతమంది ఆ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు.

పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో ఈటల పర్యటించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పలువురు బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈటల రియాల్టీ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఈటల మాట్లాడుతూ... పేదలు కష్టపడి కొనుక్కున్న స్థలాలకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కొనుగోలు చేసిన పేదల సమస్యలపై కలెక్టర్, సీపీతో మాట్లాడినట్లు చెప్పారు. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారన్నారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూల్చివేతలు తప్ప... పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

More Telugu News