self employment schemes: స్వయం ఉపాధి లబ్దిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

self employment schemes in andhra pradesh

  • స్వయం ఉపాధి రుణాలకు లబ్దిదారులు తమ వాటా చెల్లించక్కర్లేదు 
  • నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
  • యూనిట్ వ్యయంలో 50 శాతం రాయితీ, మిగతా మొత్తం బ్యాంకు రుణం

స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీనవర్గాల్లోని పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. 2024 – 25 ఏడాదికి గానూ రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు రూ.896 కోట్లు, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు రూ.384 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన ప్రభుత్వం తాజాగా పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. 

వారం లోగా అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మొత్తంగా ఈ ఏడాది స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం కింద 1.30 లక్షల మంది బీసీలు, 59వేల మంది ఈడబ్ల్యుఎస్ వర్గాలకు లబ్ది చేకూరనుంది. ఇంతకు ముందు ఈ పథకాలకు ఎంపికైన వారు లబ్దిదారుల వాటా కింద కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టేవాళ్లు. ఆ తర్వాత ఆ సొమ్ము ప్రభుత్వం రాయతీపై ఇచ్చేది. మరి కొంత బ్యాంకు రుణంగా ఇప్పించేది. కానీ ఇప్పుడు తాజా మార్గదర్శకాల ప్రకారం లబ్దిదారులు తమ వాటా భరించాల్సిన అవసరం లేదు. యూనిట్ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ పోను, మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇకపై అందించనుంది. 

యూనిట్ గ్రౌండింగ్‌కు సంబంధించి పర్యవేక్షణకు జిల్లా స్థాయి తనిఖీ బృందాలను ప్రభుత్వం నియమించనుంది. ఈ పథకం కింద ఎంపికైన వారు డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే పూర్తి చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఆన్‌లైన్ బెనిఫిషియరీ మానిటరింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఓబీఎంఎంఎస్) అనే వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. దీని ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 

అంతే కాకుండా అన్‌లైన్‌లో సొంతంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్దిదారుల రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం సంబంధిత బ్యాంకులకు జమ చేయనుంది. యూనిట్లు మంజూరైన తర్వాత నియోజకవర్గ స్థాయిలో మేళాలు నిర్వహించి అందజేస్తారు. లబ్దిదారుల బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపును పర్యవేక్షించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలో ఒకరికి అప్పగించనున్నారు. 
 
ఇక యూనిట్ల అర్హత విషయానికి వస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు, వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. మినీ డెయిరీ, గొర్రెలు, మేకల పెంపకం, మేదర, కమ్మరి, శాలివాహన కుటుంబాలకు ఆర్ధిక సాయం, వడ్రంగి పని వారికి చేయూత, జనరిక్ మందుల దుకాణాలు యూనిట్ల రుణ పథకాలకు వర్తిస్తాయి. 

  • Loading...

More Telugu News