Oval Office: అమెరికా అధ్యక్ష భవనంలో స్పెషల్ బటన్.. ఎందుకంటే..!

- డైట్ కోక్ కావాలని అడిగేందుకు ట్రంప్ ఉపయోగించే పద్ధతి ఇది..
- ఆ బటన్ నొక్కగానే సిబ్బంది డైట్ కోక్ తెచ్చి అందిస్తారట
- గతంలోనే ఈ స్పెషల్ బటన్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓవల్ ఆఫీసులోని ఆయన టేబుల్ పై సిబ్బంది స్పెషల్ బటన్ అమర్చారు. ట్రంప్ ఈ బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు డైట్ కోక్ తెచ్చిస్తారు. డైట్ కోక్ అంటే ట్రంప్ కు చాలా ఇష్టమని, రోజుకు పది పన్నెండు అలవోకగా తాగేస్తారని ఆయన వ్యక్తిగత సిబ్బందిని ఉదహరిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్ తన టేబుల్ పై ఈ బటన్ ను ఏర్పాటు చేసుకున్నారని తెలిపింది. డైట్ కోక్ కావాలని ప్రతిసారీ సిబ్బందిని పిలిచి అడగాల్సిన శ్రమను తగ్గిస్తూ ఈ బటన్ ఏర్పాటు చేసుకున్నారు.
ట్రంప్ తనకు డైట్ కోక్ తాగాలనిపించినపుడు ఈ బటన్ నొక్కుతారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉండే గదిలో ప్రత్యేకమైన సైరన్ మోగుతుంది. ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని సిబ్బంది వెంటనే ఓ డైట్ కోక్ ను తీసుకెళ్లి ట్రంప్ కు అందిస్తారు. 2021లో అధ్యక్షుడిగా ఓవల్ ఆఫీసులోకి బైడెన్ అడుగుపెట్టాక ఈ స్పెషల్ బటన్ ను ప్రెసిడెంట్ టేబుల్ పైనుంచి తొలగించారు. తిరిగి ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో మరోసారి అధ్యక్షుడి టేబుల్ పై స్పెషల్ బటన్ వచ్చి చేరింది.