Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై పోప్ సంచలన వ్యాఖ్యలు

- ప్రవాసీ విధానంపై మండిపడ్డ పోప్ ఫ్రాన్సిస్
- ట్రంప్ నిర్ణయం నిరుపేదల బతుకును దుర్భరం చేస్తుందని వ్యాఖ్య
- అమెరికా, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణంపై విమర్శ
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని గుర్తించి వెనక్కి పంపించేస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అక్రమ వలసదారుల నియంత్రణకు మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దేశంలోని అక్రమ వలసదారులను మూకుమ్మడిగా వారివారి దేశాలకు పంపించనున్నట్లు చెప్పారు. సోమవారం ఓ టాక్ షోలో పాల్గొన్న పోప్ ఫ్రాన్సిస్ దీనిపై స్పందిస్తూ.. అమెరికాలో ఉంటున్న వారిని తిరిగి పంపించాలన్న నిర్ణయం సరికాదని, దీనివల్ల నిరుపేదల బతుకు దుర్భరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రవాసులను వారి స్వదేశాలకు పంపించాలన్న ట్రంప్ ఆలోచన సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ కు పోప్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా సువర్ణావకాశాల నేలగా, అందరినీ ఆహ్వానించే దేశంగా ప్రతిష్ఠను నిలబెట్టుకుంటుందని తన ప్రార్థనల్లో కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో అమెరికా మెక్సికో మధ్య భారీ గోడను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ గోడ నిర్మాణంపై ట్రంప్ ప్రకటన చేసిన సందర్భంలోనూ పోప్ ఫ్రాన్సిస్ విమర్శలు చేశారు. ఈ నిర్ణయంతో డొనాల్డ్ ట్రంప్ అసలు క్రైస్తవుడే కాదని ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.