bhawanapadu: ఆర్సెలార్ మిత్తల్ చైర్మన్ లక్ష్మీమిత్తల్‌తో చంద్రబాబు, లోకేశ్ భేటీ

- పెట్రో కెమికల్ హబ్, సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటునకు లక్ష్మీమిత్తల్‌ను ఆహ్వానించిన లోకేశ్
- ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు, వనరులను వివరించిన నారా లోకేశ్
- ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ
దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్‌లు సోమవారం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిత్తల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు పెట్టుబడులకు లోకేశ్.. లక్ష్మీ మిత్తల్‌ను ఆహ్వానించారు. పెట్రో కెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని చెప్పారు. అలాగే ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
హెచ్‌పీసీఎల్ – మిత్తల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో 2 జి డబ్ల్యు సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే ఈ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.