Prakasam District: వ్యవసాయ కూలీలకు గుడ్ న్యూస్ .. ప్రకాశం ఎస్పీ ఆదేశాలతో పొలాల వద్దకు ప్రత్యేక బస్సులు

rtc buses to the fields in markapuram

  • వ్యవసాయ కూలీల కోసం మార్కాపురంలో ఆర్టీసీ బస్సుల ఏర్పాటు
  • కూలీల భద్రత దృష్ట్యా ప్రకాశం జిల్లా ఎస్పీ వినూత్న ఆలోచన
  • ఎస్పీ సూచనలను ఆచరణలో పెట్టిన ఆర్టీసీ అధికారులు  

రాష్ట్రంలో ఎక్కువగా కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేందుకు ఆటోలు, ట్రాక్టర్‌ ట్రక్కులు, ఇతర వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ఈ వాహనాల్లో పరిమితికి మించి అధిక సంఖ్యలో పనులకు వెళుతున్న సందర్భాల్లో అక్కడక్కడా ప్రమాదాలు సంభవిస్తుండటం తెలిసిందే. ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొందరు గాయాలతో బయటపడుతుంటారు. 

ఇటువంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వినూత్న ఆలోచన చేశారు. వ్యవసాయ కూలీల భద్రత దృష్ట్యా పనులకు వెళ్లే సమయంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. 

మార్కాపురంలో మొదటిసారి వ్యవసాయ కూలీలు పొలాల వద్దకు వెళ్లేందుకు బస్సు సర్వీసును సోమవారం ప్రారంభించారు. డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కూలీలను మార్కాపురంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దారవీడు, తర్లుపాడు, కంభం, డోర్నాల, అర్ధవీడు, బెస్తవారిపేట, కొనకనమిట్ల మండలాలకు పంపించారు. 

ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ.. కూలీల భద్రత దృష్ట్యా ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలో బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మాధవరావు, ఆర్టీసీ డిపో మేనేజర్ ఏఎస్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.      

  • Loading...

More Telugu News