Illegal Migrants: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అమెరికాలో పెట్టెబేడా సర్దుకుంటున్న అక్రమ ప్రవాసులు!

- ప్రవాసులకు స్వర్గధామంగా షికాగో
- ఈ వారంలో అక్కడి చొరబాటుదారులపై చర్యలు ఉంటాయని వార్త
- తమ పిల్లల్ని సంరక్షకులకు అప్పగిస్తున్న ప్రవాసులు
- దేశాన్ని వీడేందుకు ఏర్పాట్లు
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత అక్కడ అక్రమంగా ఉంటున్న ప్రవాసుల్లో మొదలైన గుబులు ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత మరింత ఎక్కువైంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా అమెరికాను వీడేందుకు రెడీ అవుతున్నారు. సరైన పత్రాలు లేకుండా ఇన్నాళ్లు దేశంలో ఉన్నవాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమెరికాలో పుట్టడంతో పౌరసత్వం పొందిన తమ పిల్లల బాధ్యతలను సంరక్షకులకు అప్పగించి పెట్టెబేడా సర్దుకుంటున్నారు. ఇలాంటి వారికి నోరా సానిడ్గో వంటి సామాజిక కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్లు, మెడికల్, స్కూలు రికార్డులను పిల్లల వద్ద ఉంచాలని సూచిస్తున్నారు.
ప్రవాసులకు స్వర్గధామమైన షికాగోలో చొరబాటుదారులపై ఈ వారం చర్యలు తీసుకోబోతున్నారన్న వార్త అక్కడి ప్రవాసుల్లో కలకలం రేపింది. పలువురు ప్రవాసులు షికాగోలో ఇళ్లు కొనుక్కుని స్థిరపడ్డారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. మరోవైపు, దేశంలో అక్రమంగా ఉంటున్న ప్రవాసులపై చర్యలు తప్పవని ట్రంప్ మద్దతుదారులు కూడా హెచ్చరిస్తున్నారు.