parawada pharma city: పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం

- మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఎగసిపడిన మంటలు
- భయాందోళనలకు గురయిన కార్మికులు, స్థానికులు
- మూడు గంటల పాటు శ్రమించి మంటలు అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరగడం ఇది తొలిసారి కాదు. తరచూ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫార్మా సిటీలో అగ్నిప్రమాదాలు జరగడం కార్మిక లోకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
విషయంలోకి వెళితే.. ఈరోజు ఉదయం మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించడంతో, కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కార్మికులు ఎవరికీ ఏమీ కాలేదని ప్లాంట్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.