Mamata Banerjee: ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసులో దోషికి జీవితఖైదు... సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి!

- ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్‌కి జీవితఖైదు
- తామంతా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశామన్న సీఎం మమత
- ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని వ్యాఖ్య
- ఒకవేళ పోలీసుల చేతుల్లోనే ఉంటే వారు దోషికి ఉరిశిక్ష పడేలా ప్రయత్నించే వారన్న సీఎం
కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసులో తాజాగా వెలువడిన తీర్పుపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తామంతా దోషి సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశామని ఆమె పేర్కొన్నారు. కానీ, కోర్టు అతనికి జీవితఖైదు విధించిందని చెప్పారు.
ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని అన్నారు. ఒకవేళ పోలీసుల చేతుల్లోనే ఉంటే వారు దోషికి ఉరిశిక్ష పడేలా వందశాతం ప్రయత్నించే వారని సీఎం మమత పేర్కొన్నారు.
అటు, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా సీల్దా కోర్టు దోషికి జీవితఖైదు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు న్యాయస్థానం ఎదుట ఆందోళనకు దిగారు. సంజయ్ రాయ్ కి ఉరిశిక్ష విధించాలని విద్యార్థులు నిరసన తెలిపారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సీల్దా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని ప్రకటించారు.
కాగా, న్యాయస్థానం ఇది అత్యంత అరుదైన కేసు కేటగిరీలోకి రాదని, అందుకే సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించలేమని పేర్కొంది. ఇదే అంశంపై కోల్‌కతా సీల్దా కోర్టు సీబీఐతో కూడా విభేదించింది.