Kolikapudi Srinivas: మీరు పార్టీ లైన్ దాటుతున్నారని కొలికపూడికి స్పష్టంగా చెప్పాం: వర్ల రామయ్య

- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారశైలి వివాదాస్పదం
- నేడు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొలికపూడి
- సీఎం సీరియస్ గా ఉన్న విషయాన్ని కొలికపూడికి చెప్పామన్న వర్ల రామయ్య
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తనపై వచ్చిన వివాదం పట్ల వివరణ ఇచ్చారు. విచారణ ముగిసిన అనంతరం, టీడీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు.
మీరు పార్టీ గీత దాటుతున్నారు... మీ వ్యవహార శైలి సరిగా లేదు అని క్రమశిక్షణ కమిటీ నేడు కొలికపూడికి స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. కొలికపూడి ఏడు నెలల వ్యవధిలో రెండు ఘటనల్లో రెండు సార్లు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని వర్ల రామయ్య తెలిపారు.
కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఇదే విషయాన్ని కొలికపూడికి కూడా చెప్పామని అన్నారు. త్వరలోనే కొలికపూడిపై నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఒకటేనని... కార్యకర్త అయినా, ఎమ్మెల్యే అయినా క్రమశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.