YS Sharmila: జగన్ మీకు దత్తపుత్రుడు... 'మోదానీ'కి దోచిపెట్టే ఏజెంట్: అమిత్ షాపై షర్మిల ఫైర్

Jagan is Amit Shah adopted son says YS Sharmila
  • వైసీపీ ఐదేళ్ల పాలన ఒక విపత్తు అన్న అమిత్ షా
  • రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? అన్న షర్మిల
  • దమ్ముంటే వైసీపీ పాలనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని సవాల్
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలన ఒక విపత్తు అని అమిత్ షా అన్నారని... ఐదేళ్ల పాటు విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? అని ప్రశ్నించారు. 

"ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా? రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా? ఇష్టారాజ్యంగా రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా? సొంత బాబాయి హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే... కేంద్ర హోం మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు? భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా?" అని ప్రశ్నించారు.

ఐదేళ్ల పాటు జగన్ మీకు దత్తపుత్రుడు, ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ, పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్, రాష్ట్రంలో సహజ వనరులను 'మోదానీ'కి దోచిపెట్టే ఏజెంట్ అని షర్మిల దుయ్యబట్టారు. మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీని వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని మొసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారని అన్నారు. 

2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే... కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమేనని షర్మిల చెప్పారు. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం, రూ. 3 లక్షల కోట్లు ఇస్తాం, పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనమని అన్నారు. మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటే, మీకు దమ్ముంటే... గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
YS Sharmila
Congress
Amit Shah
BJP
Jagan
YSRCP

More Telugu News