Kolkata: నన్ను ఇరికించారో లేదో మీరే నిర్ణయించండి: జడ్జితో ఆర్జీ కర్ హత్యాచారం కేసు దోషి

Kolkata court to deliver quantum of punishment

  • ఆర్జీ కర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చిన కోర్టు
  • ఎలాంటి తప్పు చేయలేదు... కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించారన్న సంజయ్
  • అన్నీ పరిశీలించాకే దోషిగా తేల్చామన్న జడ్జి

కేసులో ఆధారాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారని, దీనిని బట్టి తనను ఇరికించారో లేదో మీరే నిర్ణయించుకోవాలని కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ జడ్జితో అన్నారు. ఈ కేసులో అతనిని కోర్టు దోషిగా తేల్చింది. శిక్షను ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి జడ్జి అతనికి అవకాశం కల్పించారు. తాను ఏ నేరం చేయలేదని ఈ సందర్భంగా సంజయ్ కోర్టుకు వెల్లడించారు.

ఏ కారణం లేకుండానే తనను ఈ కేసులో ఇరికించారని, ఇప్పుడు దోషిగా నిలబెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పలు ఆధారాలు ధ్వంసమైనట్లు విన్నానని, దీనిని బట్టే తనను ఇరికించారో లేదో చూడాలన్నారు. కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించినట్లు చెప్పారు. తాను అమాయకుడినన్నారు. తాను ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తానని... నేరం చేసి ఉంటే ఆ ఘటనాస్థలంలో ఊడిపోయి ఉండేదన్నారు. అసలు తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.

సంజయ్ రాయ్ వాదనపై జడ్జి స్పందించారు. విచారణ సందర్భంగా నాతో మాట్లాడేందుకు దాదాపు సగం రోజు సమయం ఇచ్చానని... మూడు గంటలు నీ మాటలు విన్నానని గుర్తు చేశారు. తన ముందు అభియోగాలు, సాక్ష్యాలు, దస్త్రాలు అన్నీ ఉన్నాయన్నారు. అన్నింటిని పరిశీలించాకే దోషిగా తేల్చామన్నారు. ఇప్పటికే దోషిగా తేలారు కాబట్టి... శిక్ష గురించి మాత్రమే మీ ఆలోచన ఏమిటో చెప్పాలని జడ్జి అన్నారు.

సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... మరణించిన విద్యార్థిని ఎంతో ప్రతిభావంతురాలని, ఈ ఘటన సమాజాన్ని ఎంతగానో కలిచి వేసిందన్నారు. సమాజంలో వైద్యులకే రక్షణ లేకపోతే ఎలా? అన్నారు. ఈ కేసులో మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదన్నారు. కాగా, ఈ కేసులో ఈరోజు శిక్ష ఖరారు కానుంది.

Kolkata
West Bengal
RG Kar
  • Loading...

More Telugu News