Balakrishna: ఆదివారం ఆ రంగు దుస్తులు ధరించను... నాకు చాలా డేంజర్: బాలయ్య

- ఆదివారం నాడు నలుపు రంగు దుస్తులు వేసుకోనన్న బాలకృష్ణ
- తనది మూలా నక్షత్రం అని, తనకు సండే నలుపు రంగు మంచిది కాదని వ్యాఖ్య
- 'ఆదిత్య 369' షూటింగ్ లో ఆదివారం బ్లాక్ డ్రెస్ వేసుకుంటే.. నడుము విరిగిందని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణకు దైవభక్తి, పట్టింపులు ఎక్కువని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఆయన 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్‌లో తాను పాటించే ఓ నమ్మకం విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రోజు తాను నలుపు రంగు దుస్తులు అసలు వేసుకోనని, అది తనకు చాలా డేంజర్ అని బాలయ్య పేర్కొన్నారు.
తనది మూలా నక్షత్రం అని, తనకు ఆదివారం నలుపు రంగు మంచిది కాదని తెలిపారు. ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం నాడు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే.. కిందపడి తన నడుము విరిగిందని బాలయ్య చెప్పారు.
"ఆదివారం నలుపు రంగు బట్టలు ధరించను. కానీ ఓసారి బ్లాక్ డ్రెస్ ధరించినప్పుడు జరిగిన ఒక ఘటన మీకు చెబుతా. 'ఆదిత్య 369' చిత్రానికి ఎస్‌పీ బాలసుబ్రమణ్యం ఓ నిర్మాతగా ఉన్నారు. నేను ఆ రోజు నలుపు రంగు డ్రెస్ వేసుకుని షూటింగ్‌కి వెళ్లా. ఆ రోజు ఆదివారం.
నా మనసు చెబుతూనే ఉంది.. ఈరోజు సండే... బ్లాక్ డ్రెస్ వద్దు అని. రాకరాక ఆయన (ఎస్‌పీ బాలసుబ్రమణ్యం) షూటింగ్ స్పాట్‌కి వచ్చారు. బాలు కళ్ల ముందే కిందపడి నా నడుము విరిగింది. దాంతో తాను వచ్చినప్పుడు ఇలా జరిగిందని ఆయన కంగారుపడ్డారు. ఆ తర్వాత ఆయన షూటింగ్‌కి ఎప్పుడూ రాలేదు" అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.