Kiccha Sudeep: ఇదే నా ఆఖరి సీజన్.. బిగ్‌బాస్ హోస్టింగ్‌పై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్!

- రియాల్టీ షో కన్నడ బిగ్‌బాస్ హోస్ట్‌కు కిచ్చా సుదీప్ గుడ్‌బై
- ప్రస్తుతం జరుగుతున్న 11వ సీజన్ గ్రాండ్ ఫినాలేతో తర్వాత హోస్టింగ్ చేయనన్న హీరో
- ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు
ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రధాన భాషలు అన్నింటిలోనూ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇక వివిధ భాషల్లో ఆయా సినీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు దీన్ని హోస్ట్ చేస్తున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్ సేతుపతి ఇలా పలు భాషల్లో స్టార్స్ ఈ షోకు హోస్టింగ్ చేస్తూ క్రేజ్ తీసుకువచ్చారు.
అలాగే కన్నడలో స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 11 సీజన్లకు ఆయన హోస్ట్‌గా ఉన్నారు. అయితే, తాజాగా ఈ షోకు తన హోస్టింగ్ విషయంలో సుదీప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఈ షోకు హోస్టింగ్ చేయనని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ గ్రాండ్ ఫినాలే తర్వాత తాను ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేయబోనని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రత్యేకంగా ఓ పోస్టు పెట్టారు.
"గత 11 సీజన్లలో నేను బిగ్‌బాస్‌ను చాలా ఎంజాయ్ చేశాను. వ్యాఖ్యాతగా నాపై మీరు చూపిన ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయే గ్రాండ్ ఫినాలేతో హోస్ట్‌గా నా ప్రయాణం ముగుస్తుంది. ఇదే నా చివరిది. మీ అందరినీ నా శక్తి మేరకు అలరించాలని ఆశిస్తున్నాను. ఇది మరపురాని ప్రయాణం. దీన్ని నా శక్తి మేరకు నిర్వహించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని సుదీప్ రాసుకొచ్చారు.