Auto Driver: ఉచితాలు వద్దంటూ కొటేషన్.. సిరిసిల్ల ఆటో డ్రైవర్ పై ప్రశంసల వర్షం

- ఎన్నికల వేళ అధికారమే లక్ష్యంగా ఉచిత హామీలు గుప్పిస్తున్న పార్టీలు
- ప్రజలను బద్దకస్తులుగా మార్చడమేనని మేధావుల ఆందోళన
- ఉచితాలు వద్దు.. ఉపాధి ముద్దు అంటూ ఆటోపై కొటేషన్ రాసుకున్న డ్రైవర్
ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలు ఉచితాలు ప్రకటించడం సర్వ సాధారణంగా మారింది. తమను గెలిపిస్తే అన్నీ ఉచితంగా ఇస్తామంటూ పార్టీలు చేసే ప్రకటనల ఆధారంగానే ఓట్లు పడుతున్నాయి. అధికారంలోకి రావాలంటే ఉచిత హామీలు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. అయితే, ఇలా ఉచితాలతో ప్రజలను బద్దకస్తులుగా మార్చేస్తున్నారని, ఇలాగే కొనసాగితే దీనివల్ల ప్రభుత్వాలు దివాళా తీస్తాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదు.
ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై రాయించిన కొటేషన్ చూసి పలువురు అతడిని మెచ్చుకుంటున్నారు. ’ఉచితాలు వద్దు.. ఉపాధి ముద్దు‘ అంటూ ఆటో వెనక రాసిన నినాదం జనాలను ఆలోచింపజేస్తోంది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ ప్రభుత్వం ఇచ్చే ఉచితాలకు వ్యతిరేకంగా నినదించడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లా కేంద్రంలో రాంబాబు అనే వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో చిన్న ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాడు. కొంతకాలం నేత కార్మికుడిగా పనిచేసిన రాంబాబు అనారోగ్యానికి గురవడంతో వైద్యుల సలహా మేరకు సాంచా పనికి స్వస్తి చెప్పాడు. కోలుకున్నాక ఆటో కొనుక్కుని సిరిసిల్లాలో తిప్పుతూ వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఆటోపై రాయించిన నినాదంపై రాంబాబు మాట్లాడుతూ.. ఉచితాల వల్ల అన్నీ ఇబ్బందులేనని చెప్పాడు. ఉచితాలకు తాను వ్యతిరేకమని చెబుతున్నాడు.
వాటి స్థానంలో యువతకు ఉపాధి కల్పించే పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశాడు. ఆటో ద్వారా వచ్చే ఆదాయమే తప్ప రాంబాబుకు ఇతరత్రా ఆదాయం వచ్చే మార్గాలేవీ లేవు. అయినప్పటికీ వచ్చే ఆ కొద్దిమొత్తంతోనే తల్లిదండ్రులను, భార్యాపిల్లలను పోషించుకుంటూ ప్రభుత్వం నుంచి తాను ఉచితంగా ఏమీ ఆశించబోనని చెబుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. పదేళ్లుగా ఆటోపై కొటేషన్ తో జనాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నానని, చాలామంది తన ఆటో వద్ద ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారని రాంబాబు చెప్పాడు.