Chegondi Harirama Jogaiah: పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: హరిరామ జోగయ్య

Harirama Jogaiah demands Kapu reservation

  • గత టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించిందన్న జోగయ్య
  • వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ట కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శ
  • చంద్రబాబు కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఆగస్ట్ 3వ తేదీన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని హరిరామ జోగయ్య గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి... కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కాపు సంక్షేమ సేన హైకోర్టును కూడా ఆశ్రయించిందని తెలిపారు. తాము వేసిన పిటిషన్ పై వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని చెప్పారు. 5 శాతం రిజర్వేషన్ అమలు చేయలేమని స్పష్టం చేసిందని విమర్శించారు. 

ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. డిసెంబర్ 4న హైకోర్టులో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ నే సమర్థిస్తూ అడ్వొకేట్ జనరల్ తన వాదనలను వినిపించారని చెప్పారు. ఈ నెల 28న పిటిషన్ పై మరోసారి విచారణ జరగనుందని తెలిపారు. ఈలోగా కాపు రిజర్వేషన్ పట్ల స్టాండ్ ఏమిటో కూటమి ప్రభుత్వం తెలపాలని అన్నారు. గతంలో చంద్రబాబు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరారు. కాపు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News